శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి మెజారిటీ ఉండే అవకాశం లేదు. వారికి మద్దతు ఇవ్వడానికి ఏపీ అసెంబ్లీలో ఇతర పార్టీలు ఏమీ లేవు. ఉన్నది పాలకపక్షం మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షం స్పీకరు మీద అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం ఏమవుతుంది? వారికి ఏదైనా ప్రయోజనం ఒనగూరుతుందా? అంటే ఏమీ ఉండదు. కానీ జగన్ స్కెచ్ మాత్రం వేరుగా కనిపిస్తోంది.
స్పీకరు మీద అవిశ్వాస తీర్మానం పెడితే అది ఓటింగ్‌కు వస్తుంది. సదరు ఓటింగ్‌లో తమ పార్టీ తరఫున సభ్యత్వం ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ వైకాపా విప్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. సదరు ఓటింగ్ కార్యరూపంలోకి వచ్చేలోగా.. తెలుగుదేశంలోకి వెళ్లదలచుకుంటున్న ఇతర ఎమ్మెల్యేల వలసల పర్వం కూడా పూర్తవుతుంది. ఆ నేపథ్యంలో.. ఫిరాయించిన వాళ్లంతా విప్‌ను ఎటూ ఉల్లంఘిస్తారు. వారు విప్‌ను ఉల్లంఘించారంటూ.. వారి మీద తక్షణం అనర్హత వేటు వేయాలంటూ స్పీకరుకు ఫిర్యాదు చేయడానికి.. ఆ పాయింటు మీద న్యాయపరంగా పోరాడడానికి జగన్‌కు అవకాశం ఉంటుంది.
విప్‌ను ఉల్లంఘించారంటూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు గురించి జగన్ పార్టీ ఫిర్యాదు చేసినంత మాత్రాన వెంటనే అది జరిగిపోతుందా అంటే చెప్పలేం!! చేసిన ఫిర్యాదు మీద ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవాలనే విషయంలో స్పీకరును ప్రభావితం చేయడానికి లేదా, స్పీకరునుంచి పలానా గడువులోగా చేయాలని ఆశించడానికి అవకాశం లేదు. అయితే న్యాయపోరాటం కూడా ప్రారంభించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇలా అరాచకంగా వ్యవహరిస్తున్నదంటూ మరింతగా బజారుకీడ్చడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే జగన్ ఈ స్కెచ్ రచించినట్లు తెలుస్తోంది.