పవన్ కల్యాణ్ – రానా నటించిన ‘భీమ్లా నాయక్’ ఓ మల్టీస్టారర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు సితార నుంచి మరో ఇద్దరు హీరోల కథ రాబోతోంది. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు వేణు ఉడుగులతో.. సితార సంస్థ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసింది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికీ, పాతికేళ్ల కుర్రాడికీ మధ్య నడిచే డ్రామా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పెద్ద హీరోల కోసమే ప్రయత్నిస్తోంది. కుదరని పక్షంలో.. తమిళం నుంచి ఓ స్టార్నీ, తెలుగు నుంచి మరో స్టార్నీ కలిపే ప్రయత్నం చేస్తుంది. అదీ కాకపోతే.. ఈ ఇద్దరు హీరోల్నీ తమిళం నుంచే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలుగులో, అటు తమిళంలో హీరోలంతా బిజీగా ఉన్నారు. ఈ కథ పెద్ద హీరోల్ని డిమాండ్ చేస్తోంది. వాళ్ల కాల్షీట్లు దొరకడమే కాస్త కష్టంగా మారుతోంది. లేదంటే ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లిపోయేది. ఈ హీరోలెవరు? అనేది ఫిబ్రవరి నెలాఖరులోగా తెలిసిపోతుంది. స్క్రిప్టు ఇప్పటికే సిద్ధంగా ఉంది. హీరోలు దొరగ్గానే.. ప్రాజెక్టుని పట్టాలెక్కించేస్తారు. మరోవైపు మైత్రీ మూవీస్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకొన్నాడు వేణు. వాళ్లకీ ఓ సినిమా చేసి పెట్టాలి.