వాల్తేరు వీరయ్యతో మెగా హిట్ పడింది. చిరు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఇది. ఈ విజయం చిరంజీవిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది. తను ఎలాంటి కథలు చేయాలన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. తనపై మాస్, కమర్షియల్ కథలు ఇప్పటికీ వర్కవుట్ అవుతాయన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు చిరు దృష్టి మాస్ దర్శకులపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కి తగ్గట్టు క్యారెక్టర్లు రాసుకొనే దర్శకులకు ఇప్పుడు మంచి ఛాన్స్. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులకు.. చిరు గురించి బాగా తెలుసు. చిరుని ఎలా చూపిస్తే… అభిమానులకు నచ్చుతందన్న విజన్ పూరికి ఉంది. చిరుకి పెద్ద అభిమాని కూడా. ఎప్పటి నుంచో చిరుతో ఓ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఇటీవల `గాడ్ ఫాదర్`లో చిరు కోరికపై ఓ చిన్న పాత్ర కూడా చేశాడు పూరి. మాస్, కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట. చిరు కోసం ఓ మంచి కథ కూడా తయారు చేసుకొంటున్నాడు. `నువ్వెప్పుడు మంచి కథతో వచ్చినా సినిమా చేయడానికి నేను సిద్ధమే` అంటూ చిరు కూడా `గాడ్ ఫాదర్` సమయంలో పూరికి ఆఫర్ ఇచ్చేశాడు. సో.. పూరికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకోటి దొరకదు. `లైగర్` తరవాత.. ఎలాంటి సినిమా చేయాలి? ఎవరితో చేయాలి? అనే విషయంలో పూర్తి సందిగ్థంలో పడిపోయాడు పూరి. ఇప్పుడు తన ముందు చిరు రూపంలో మంచి అవకాశం ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.