ఏపీలో ఇక పొత్తులే ఉండొద్దని బీజేపీ డిసైడయినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ పొత్తులో ఉన్నా… అసలు పట్టించుకోకపోతూండటం.. ముఖ్యమంత్రిని చేస్తామని ఇతర పార్టీల నేతల్ని బతిమాలాల్సిన అవసరం ఏముందని హైకమాండ్ తీర్మానించుకోవడంతో.. ఇక ఏపీలో పొత్తుల గురించి వద్దని డిసైడయినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడంతో.. అప్పుడే మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. పొత్తులుండవని ప్రకటించారు.కానీ ఆయన మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.
ఏపీలో పొత్తుల వల్ల ఎక్కువగా నష్టపోయామన్న భావన బీజేపీ నేతల్లో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీ మైనర్ భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. జాతీయ పార్టీగా ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమే. అందుకే జనసేనతో పొత్తు విషయంలోనూ ఒత్తిడి చేయకూడదని.. భావిస్తున్నట్లుగా జాతీయ కార్యవర్గ సమావేశంలో సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వలనే పార్టీ ఏపీలో ఎదగలేదనే అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది. జనసేన పార్టీనే వద్దని అనుకుంటున్నందున.. తాము బతిమాలడటం బాగుండదన్న ఆలోచనకు వస్తున్నారు.
ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించ నున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధిష్టానం నిర్ణయం పై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీ.మురళీ ధరన్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. పొత్తులను పక్కనబెట్టి సొంత ఎదు గుదలపై దృష్టిసారించాలంటూ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చినందున ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం ఆలోచనను సైతం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి స్పష్టం చేయనున్నారు. అదే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు. పొత్తుల గురించి వదిలేసి.. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకునే అవకాశం ఉందంటున్నారు.