ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గెలవాలి అని కార్యవర్గ సమవేశంలో బీజేపీ తీర్మానించుకున్న సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ మూడు రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్. వీటిలో బీజేపీ గెలుస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి.
త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు బీజేపీకి అక్కడ ఒక్క శాతం కూడా ఓట్లు ఉండేవి కాదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు పరిస్థితి మారిన సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. 2018లో విప్లవ్ దేవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయన పనితీరు బాగాలేదని కొంతకాలానికి దింపేసి మాణిక్ సాహాను సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. ఆయనను కూడా కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే.. హోరాహోరీ పోరు ఉంటుంది. బీజేపీకి ఎదురీతేనన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
మేఘాలయలో బీజేపీకి ఉన్నది రెండే రెండు సీట్లు. నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగం అయింది. . అయితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయి . తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని సీఎం కన్రాడ్ సంగ్మా ప్రకటించారు. బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని ప్రకటించింది. మేఘాలయలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకటి, రెండు సీట్లు సాధిస్తే.. బలవంతంగా అధికార కూటమిలో చేరే అవకాశం ఉంటుంది.
నాగాలాండ్‌లోనూ సంకీర్ణ కూటమిలో బీజేపీ భాగస్వామి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. మరోవైపు ఏడు గిరిజన తెగలకు చెందిన ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది బీజేపీపై ప్రభావం చూపవచ్చు. నాగాలాండ్‌లో 75 శాతానికిపైగా క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ బీజేపీ సొంతంగా గెలవడం కష్టం కానీ..కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మాత్రం అవకాశం ఉంది. ఎలా చూసినా.. తొమ్మిదిలో మొదటే మైనస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.