వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు ఏమిటంటే.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు. పదిహేను వేలు నెలకు చేతిలో పెట్టి పని చేయించుకుంటున్నారు. రెండేళ్లకు ప్రొబేషన్ ఇస్తామని చెప్పి.. ఆందోళనలు చేసిన తరవాత మూడేళ్లకు ప్రొబేషన్ ఇచ్చారు. అదీ అందరికీ కాదు. మొదటి విడతలో చేరి.. ఎలాంటి వివాదాలు, కేసులు లేకుండా, పెట్టిన పరీక్షలన్నీ పాసయిన వారు.. ఉన్నతాధికారుల కరుణ ఉన్న వారికే ఈ అవకాశం దక్కింది. ఎనభై వేల మంది వరకూ ఇలా ప్రొబేషన్ తో పర్మినెంట్ అనిపించుకున్నారు. తర్వాత రెండో విడతల చేరినవారి ప్రొబేషన్ గురించి ఇంత వరకూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ పొందని ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. వీరంతా తమ ప్రొబేషన్ గురించి పదే పదే మొరపెట్టుకుంటున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. నిజానికి వారికి ఎంపిక చేసిన ప్రాసెస్ ప్రకారం రెండేళ్లు ముగియగానే వెంటనే.. ప్రొబేషన్ ప్రకటించాలి. కానీ అలా చేయడం లేదు. ప్రభుత్వం అనుమతిస్తే.. ఉన్నతాధికారులే ఈ నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతించకపోవడంతో వారికి ప్రొబేషన్ ప్రకటించడానికి కలెక్టర్లు కూడా ఆసక్తి చూపించడం లేదు.
ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వడానికి టెన్షన్ పడుతోంది. జీతాల భారం పెంచుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఈ కారణంగానే రెండో విడత సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. తాము చేరి మూడేళ్లుదాటిపోతోందని.. తమ సర్వీస్ అంతా వృ్ధా అవుతోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.అయితే ఎన్నికలకు ముందు వీరిగ ప్రొబేషన్ ఖరారు చేస్తారని.. అప్పటి వరకూ ఎదురు చూడాల్సిందేనన్న వాదన ఉద్యోగ సంఘ నేతల్లోనూ వినిపిస్తోంది.