తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు టెన్షన్ తప్పడం లేదు. వారందరిపై హైకోర్టులో కేసు విచారణలో ఉంది. తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ కూడా ఏపీ క్యాడర్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో సోమేష్‌కుమారు, అంజనీకుమార్‌తోపాటు 12 మంది సివిల్ సర్వీస్ అధికారులను కేంద్రం ఏపీకి కేటాయించింది. వీళ్లంతా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే సోమేష్ కుమార్ ను ఏపీకి పంపారు. దీంతో వారినీ పంపుతారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ పేరుతో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా 15 మందిని ఏపీకి పంపకుండా అడ్డుకున్నారని సోమేశ్ కుమార్ తరహాలోనే తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ అధికారులను ఆ రాష్ట్రానికి పంపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే తెలంగాణ డీజీపీని కూడా ఏపీ కేడర్‌కు కేటాయించారని, అక్కడికే పంపించాలని అంటున్నారు.
ఏపీ కేడర్ అధికారుల అంశంపై ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్తామని.. 13 మంది సివిల్ సర్వెంట్స్‌పై 2017లో కేంద్ర ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిందని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చినట్లే ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అంటోంది. అయితే బీజేపీ ఈ అంశాన్నిరాజకీయంగా వాడుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ చెబుతున్న పదిహేను మంది ఏపీ క్యాడర్ అధికారులు అత్యంత కీలక పొజిషన్లలో ఉన్నారు. వారు ప్రభుత్వానికి సహకరించకుండా ఉండటానికే ఇలా ఒత్తిడి తెస్తున్నారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.