విజయ్‌తో్ వంశీ పైడిపల్లి సినిమా అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. చాలా అనుమానాలూ వచ్చాయి. ఇది తమిళ సినిమా? తెలుగు సినిమానా? అని. ద్విభాషా చిత్రం అంటూ బిల్డప్పులు ఇవ్వకుండా ఇది తమిళ సినిమానే అంటూ.. చిత్ర బృందం ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. తెలుగులో ఇది డబ్బింగ్ బొమ్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ తెలుగు దర్శకుడిగా వంశీ పైడిపల్లి తమిళ సూపర్ స్టార్ తో సినిమా తీయడం… నిజంగానే ఓ ఎచీవ్‌మెంట్. తెలుగులో వారసుడు చూసి పెదవి విరిచారంతా. సీరియల్‌లా ఉందనో, మిక్చర్ పొట్లమనో.. కామెంట్లు చేశారు. కానీ.. తమిళంలో మాత్రం `వారిసు` పెద్ద హిట్టు. అక్కడ విజయ్ గత చిత్రాల రికార్డుల్ని తిరగరాసింది. దీన్ని తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చిన దిల్ రాజు అండ్ కో.. చివరి వరకూ దానికే కట్టుబడి ఉన్నారు. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ప్రమోషన్లు చేశారు. తెలుగులో ఎంతొచ్చినా బోనస్ అనుకొన్నారు. తెలుగులో వచ్చిన టాక్, వసూళ్లు పక్కన పెడితే.. తమిళంలో `వారిసు` హిట్టే. అందుకు కలక్షన్లే సాక్ష్యం. 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు సాధించింన సినిమా ఇది. తమిళంలో విజయ్‌ది మాస్ ఇమేజ్. దానికి కాస్త భిన్నంగా ఫ్యామిలీ టచ్‌తో తీసిన సినిమా ఇది. అందుకే విజయ్ ఫ్యాన్స్‌కి సైతం అక్కడ కొత్తగా అనిపించింది.అదే `వారిసు` విజయ రహస్యం. తెలుగు దర్శకులు చాలామంది తమిళంలో సినిమాలు తీశారు. తమిళ దర్శకుడు సైతం తెలుగు హీరోలతో హిట్టు కొట్టాలని ప్రయత్నించారు. కానీ వాళ్లెవరికీ సాధ్యంకాని హిట్.. వంశీ పైడిపల్లి ఖాతాలో పడినట్టైంది.