సలహాలదారుల పేరుతో ప్రభుత్వం సొంత వారికి ఇష్టం వచ్చినట్లుగా పదవులు కేటాయించింది. ఉత్తర్వులు బయట పెట్టని సలహాదారులు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియదు. ప్రస్తుతం హైకోర్టు సలహాదారుల వ్యవహారంపై విచారణ జరుపుతోంది. ప్రభుత్వం ఎంత మంది సలహాదారుల్ని నియమించిందో.. వారికి ఎంత జీతభత్యాలు చెల్లిస్తున్నారో కోర్టుకు చెప్పాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. కానీ లెక్కలు ప్రభుత్వానికీ కనిపించలేదు. అందుకే అన్ని శాఖలకూ లేఖలు రాశారు. మీ దగ్గర ఎంత మందిని సలహాదారులుగా నియమించారు.. ఎంతెంత జీతాలు ఇస్తున్నారు అనే సమాచారం పంపాలని అందులో పేర్కొన్నారు.
సలహాదారులను నియమించింది ముఖ్య సలహాదారుడే !
నిజానికి సలహాదారులను ఏ శాఖ నియమించుకోలేదు. కేవలం ప్రభుత్వ పెద్దల రాజకీయ పునరావాసం కోసం ఈ సలహాదారులను నియమించారు. అది ఏ శాఖ అన్నది చూసుకోలేదు. ఇంటర్ కూడా పూర్తి చేయని వారికి వ్యవసాయ శాఖ.. కంప్యూటర్లో ఓనమాలు తెలియని వారికి సాంకేతిక శాఖ ఇలా .. సలహాదారులను నియమించేశారు. చివరికి ప్రభుత్వం ఎప్పుడూ చేయని.. జాబ్ మేళాలకూ ఓ సలహాదారుడ్ని నియమించారు. అందరూ వైసీపీ నేతలే. గతంలో పార్టీ కోసం పని చేసి ఇతర పార్టీల నేతల్ని తిట్టిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికన్నట్లుగా…నెలకు రూ. నాలుగైదు లక్షలు సమర్పించేందుకు ఈ పదవులు కట్టబెట్టారు.
ఇప్పుడు ఎవరు నియమించారో తెలియనట్లుగా శాఖలకు లేఖలు !
అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం తమ వద్ద సమాచారం లేదని… చెబుతోంది. అసలు నియామకాలు జరిగింది.. ముఖ్య సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి .లెక్కలు తీస్తే క్షణాల్లో బయటకు వస్తాయి. కానీ మా దగ్గర సమాచారం లేదని.. సలహాదారులెంత మందో చెప్పాలని ఆదేశాలు జారీ చే్శారు. దీనికి.. కారణం ఆయా సలహాదారుల నియామకాల్లో తమ ప్రమేయం ఏమీ లేదని.. ఆయా ప్రభుత్వ శాఖలే నియమించుకున్నాయని చెప్పాలని ప్రభుత్వం అనుకుంటోందని.. అందుకోసమే ఇలాంటి లే్ఖలు రాసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టులో ఆయా శాఖ ఉన్నతాధికారులదే తప్పని చెప్పబోతున్నారా ?
రాజకీయ పునరావసంగా సలహాదారుల పదవులు మార్చి.. ప్రజాధనాన్ని వందల కోట్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ పాపం మాది కాదని..అధికారులపై నెట్టే ప్రయత్నాన్ని పకడ్బందీగా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తామే సలహాదారుల్ని నియమించుకున్నట్లుగా ఆ శాఖలు సమాచారం ఇస్తే.. ఉన్నతాధికారులు ఇరుక్కుపోయినట్లే. కోర్టులో ఏమీ తేలకపోయినా వచ్చే ప్రభుత్వం.. లెక్కలు తీసి.. చేయాలనుకున్నది చేయడం మాత్రం ఖాయం.