తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ పద్దులు సహజంగా మార్చిలో ప్రవేశ పెడతారు. కేంద్రం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెడుతోంది. ఆ బడ్జెట్ లో కేటాయింపుల ఆధారంగా రాష్ట్రాలు తమ అంచనాలు వేసుకుంటాయి. ఈ సారి కేంద్రం బడ్జెట్ పెట్టిన రెండు రోజుల్లోనే తెలంగాణ కూడా బడ్జెట్ పెట్టాలని డిసైడయింది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటివారంలో పెట్టాల్సిన బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టాలనుకోవడంతో అనేక చర్చలు ప్రారంభమయ్యాయి.
గత 10 రోజులుగా రాష్ట్ర బడ్జెట్‌పై భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలు నిర్ణీత ఫార్మాట్లో పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఆన్లైన్లో పంపాలని స్పష్టం చేసింది. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా 2023-24 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేయనున్నారు.
ఈ సారి కళ్లు తిరిగిపోయే బడ్జెట్ పెట్టనున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి హంగూ ఆర్భాటాలు..బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తూంటే.. కేసీఆర్.. ఆర్థిక సంవత్సరం రాక ముందే బడ్జెట్ ఆమోదించేసుకుని.. ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు దాన్నే నిరూపిస్తున్నాయంటున్నారు.