నారా లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ యువగళం పేరుతో చేయాలనుకున్న పాదయాత్ర కోసం గత ఆరు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన తనకు మద్దతుగా ఉంటున్న ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఇలా కొన్ని వేల మందితో ముఖాముఖి సమావేశం అయ్యారు. కనీసం పాతిక వేల మందితో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి మద్దతు కోరారు. ఓ పాజిటివ్ వేవ్ తన పాదయాత్రలో ఉండేలా ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర ప్రారంభం దగ్గరకు వచ్చేసింది.
తన పాదయాత్రను లోకేష్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో.. వైసీపీ కూడా అంత కంటే ఎక్కువగానే సీరియస్‌గా తీసుకుంది. ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి దేనికైనా తెగిస్తామన్న సంకేతాలు పంపుతోంది. ఆయన పాదయాత్ర రోజు వెళ్లకుండా యువ నేతలను కేసుల్లో విచారణ పేరుతో పిలిపించే ప్రయత్నం చేయడమే కాదు.. ప్రారంభం రోజున కుప్పంలో రణరంగం సృష్టించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రపై దాడులు చేద్దాం రమ్మంటూ శాంతిపురం మండల ఎంపీపీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. ఆ రోజున కుప్పంలో ఏం జరగబోతోందో ముందే చెబుతున్నారు.
మరో వైపు నారా లోకేష్ మీడియా మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలు టీవీ చానళ్ల యజమానులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. దీనికి పోటీగా వైసీపీ పెద్దలు కూడా కొన్ని టీవీ చానళ్ల యజమానులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రకు కవరేజీ ఇవ్వాల్సి వస్తే అది నెగటివ్ గానే ఉండాలి తప్ప.. పాజిటివ్ గా ఉండకూడదని.. సమస్యలు హైలెట్ అయ్యే లా అసలు ఉండకూడదని సూచనలు ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది. ఓ ఈ విషయంలో ఏపీ సర్కార్ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన కాంట్రాక్టర్ల చేతిలో ఉన్న చానల్ మరింత అత్యుత్సాహం చూపించడానికి ప్లాన్ చేసుకున్నట్లు.. ఇందు కోసం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బృందాన్ని కూడా పంపనున్నట్లుగా చెబుతున్నారు.
కారణం ఏదైనా.. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే.. అడ్డుకోవడాలు.. ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేలా చూసుకోవడమే బెటరని లేకపోతే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని నిన్నటి వరకూ రాజకీయ పార్టీలు భావించాయి. కానీ ఇప్పుడు ప్రజలేమనుకున్నా పర్వాలేదు వాళ్లను రోడ్డుపైకి ఎక్కనివ్వకూడదని.. కావాలటే చీకటి జీవోలు.. దాడులు .. దహనాలు చేసైనా ఆపేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాజకీయం కూడా.. రాజకీయ నేతల మనస్థత్వానికి తగ్గట్లుగానే ఉంటుందని దీన్ని బట్టే తెలుస్తోంది.