ఈమధ్య సౌత్ చిత్రాల ధాటికి బాలీవుడ్ సైతం తల్లడిల్లిపోయింది. ఓ వైపు వరుసగా దక్షిణాది సినిమాలు సూపర్ హిట్ అవ్వడం.. హిందీ సినిమాలు బోల్తా కొట్టడం అక్కడి విశ్లేషకుల్ని సైతం కలరవపెడుతోంది. బాలీవుడ్ కి పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా? అని హిందీ జనాలు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం `పఠాన్`తో ఆసన్నమైందేమో అనిపిస్తోంది. చాలాకాలంగా షారుఖ్ కి సరైన హిట్లు లేవు. తన సినిమాలు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. అయితే ఈనెల 25న విడుదల అవుతున్న `పఠాన్`పై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌తో పాటు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు ఆకట్టుకోవడంతో… ‘పఠాన్‌పై’ ఫోకస్ పెంచారు ప్రేక్షకులు. ఈ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై చూపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో పఠాన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే దాదాపుగా 1.75 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. నార్త్ బెల్ట్ లో, ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పఠాన్ జోరు చూస్తుంటే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల వసూళ్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. బాహుబలి 2 రికార్డ్ ని పఠాన్ చెరిపేసినట్టే. తొలి రోజు బాహుబలి 2.. రూ.42 కోట్లు సాధించింది. ఆ రికార్డుని `పఠాన్` చెరిపేసే అవకాశం కనిపిస్తోంది. టాక్ ఏమాత్రం బాగున్నా.. పఠాన్ బాక్సాఫీసు దగ్గర నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ కి ఈమధ్య సరైన హిట్టు లేదు. 2022 చప్పగా సాగింది. పఠాన్ తో ఈ కొత్త యేడాదిని సూపర్ హిట్ తో మొదలు పెడితే… అంతకంటే కావల్సిందేముంది?