ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మోసం చేసేస్తున్నది.. రావాల్సింది అసలేమీ రావడం లేదు.. ఇదిగో అదిగో అంటూ మాటలు చెప్పి రోజులు నెట్టేస్తున్నారే తప్ప.. హక్కుభుక్తంగా ఈ నిర్భాగ్య కొత్త రాష్ట్రానికి దక్కవలసినవి కూడా ఇవ్వడం లేదు… ఇలాంటి ఆరోపణలు చాన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ మాటలను గళమెత్తి గట్టిగా వినిపించడానికి తెలుగుదేశం శ్రేణులకు ధైర్యం లేదు. అదే సమయంలో ఇలాంటి ప్రచారాల్ని తిప్పికొట్టడానికి మాత్రం ఏపీ భాజపా లీడర్లు ఎక్కడికక్కడ ప్రతిసారీ అత్యుత్సాహాన్ని చూపిస్తూ వచ్చారు.
పురందేశ్వరి లాంటి నోటిదుడుకు ఉన్న నాయకులైతే.. ఏకంగా.. ఏపీకి కేంద్రంనుంచి లక్షకోట్లు తెచ్చాం.. చంద్రబాబు కేంద్ర నిధులనంతా ఎలా పడితే అలా వాడేస్తున్నారు.. అంటూ పొంతనలేని గణాంకాలతో నానా బీభత్సమైన ప్రకటనలు చేసేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో మార్చి 6వ తేదీన ఏపీలో అమిత్షా ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వేస్తున్న అడుగుల్లో ఇది కీలకమైనదిగా భావించాలి. ఇలాంటి సమయంలో.. అమిత్షా వచ్చి… ఏపీకి కేంద్రం ఎంత సాయం చేస్తున్నదో వివరించడానికే ఈ సభ అంటూ.. భాజపా నాయకులు చాలా రోజులుగా ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఈ బడ్జెట్ అవమానించినంతగా, చిన్నచూపు చూసినంతగా గతంలో ఎన్నడూ జరగలేదేమో అంటే అతిశయోక్తి కాదు. కేవలం వారం రోజుల ముందు ఈ బడ్జెట్ ఇంత దారుణంగా వంచించిన తరువాత.. ఏమొహం పెట్టుకుని అమిత్షా.. రాష్ట్రానికి తమ కేంద్ర సర్కారు ఇతోధికంగా సాయం చేస్తున్నదని సభలో చెప్పగలరో అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏ మొహం పెట్టుకుని ఏపీ ప్రజల ఎదుటకు రాగలరో తెలియడం లేదని పలువురు దెప్పిపొడుస్తున్నారు.