తెలంగాణ అధికార వర్గాల్లో ఈ అంశం ఓ సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి. ఓ డిప్యూటీ తహశీల్దార్ చొరబడ్డారు. అది కూడా పట్టపగలు అయితే సరే ఏదో పని ఉందని లైట్ తీసుకునేవారు. కానీ ఆయన అర్థరాత్రి పూట చొరబడ్డారు. ఈ విషయాన్ని ఆ మహిళా ఐఏఎస్ గమనించి కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. ఆ అధికారిని ఆనంద్ కుమార్ రెడ్డి గా గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఆ మహిళా ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఆమె భర్త కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆమె స్పందనలపై పలు రకాల వివాదాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ అధికారి అర్థరాత్రి పూట ఆమె ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పోలీసులు గుంభనంగా ఉన్నారు. కేసు నమోదవబట్టే అసలు విషయం బయటకు తెలిసింది. డిప్యూటీ తహశీల్దార్ గా ఉన్న ఆనంద్ కుమార్ రెడ్డికి.. ఆ మహిళా ఐఏఎస్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
అయితే విధి నిర్వహణలో డిప్యూటీ తహశీల్దార్ .. అవకతవకలకు పాల్పడి ఉంటారని.. ఆయనపై ఆ మహిళా ఐఏఎస్ చర్యలు తీసుకుని ఉంటారని.. పగతో ఏదైనా హాని తలపెట్టడానికి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు తేల్చాల్సి ఉంది. కేసు నమోదయింది కాబట్టి.. .. పోలీసులు వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.