దేశంలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురై.. వారి అసలు ప్రతిభ కన్నా.. సామర్థ్యం కన్నా దారుణంగా డీగ్రేడ్ చేయబడిన నాయకులు ఇద్దరు ఒకరు రాహుల్ గాంధీ .. మరొకరు లోకేష్. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారు. కానీ వారు వెలుగులోకి వస్తున్న సమయంలోనే దేశంలోకి కొత్తగా వస్తున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుని వారిపై పప్పు అనే ముద్ర వేయడంలో ఇతర పార్టీలు విజయం సాధించాయి. దానికి వారి ఆహర్యం కూడా కలసి వచ్చింది. నీట్ షేవింగ్ చేసుకుని .. గడ్డం లేకుండా ఉండటాన్ని వారు పప్పుగా చిత్రీకరించారు.
రాజకీయాల్లోకి రాక ముందు నుంచే లోకేష్ పై రాజకీయ కుట్రలు – ప్రజల్లో సాప్ట్ ఇమేజ్ వచ్చేలా ప్రచారం
రాజకీయాల్లో ఉండాలంటే రౌడీయిజం ఉండాలని.. రఫ్ గా ఉండాలని చదువుకున్న వాళ్లు పనికి రారన్న ఓ అభిప్రాయాన్ని కల్పించారు. కానీ లోకేష్ అలా కాదు.. స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నారు. ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నారు. కారణం ఏదైనా ఆయన నీట్ షేవ్ తో కనిపించేవారు. కాస్త బొద్దుగా ఉండేవారు. ఈ కారణాలను చూపి సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదే ప్రత్యర్థులు ఎన్ని నేరాలు, ఘోరాలు చేస్తే అంత గొప్ప అని ప్రజెంట్ చేశారు. ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. ఈ రాజకీయంగా బలైపోయిన లోకేష్.. ఇప్పుడు తనను మల్చుకుంటున్నాడు. తనలో మార్పు తెచ్చుకోవడమే కాదు.. రాజకీయాలంటే నేరస్తులు కాదని.. నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పుడు లోకేష్ రోడ్డెక్కుతున్నారంటే వణికిపోతున్న ప్రభుత్వం
మూడేళ్ల కిందట లోకేష్ పాదయాత్ర అంటే.. ఎవరైనా కాస్త స్మైలీ ఫేస్ పెట్టేవారు. అప్పుడాయన ఇమేజ్ అలాగే ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే వణికిపోతోంది. ఆయన రోడ్డెక్కకుండా ఏం చేయాలో అన్నీ ఆలోచిస్తోంది. కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఇది చాలు లోకేష్.. లో ఎంతో మార్పు వచ్చిందని.. లోకేష్ ను ప్రజలు చూసే తీరులో మార్పు వచ్చిందని చెప్పడానికి. ఇదేమీ ఓవర్ నైట్ రాలేదు. ఆయన కష్టపడి సాధించారు. తనపై ప్రత్యర్థులు వేసిన ఓ రకమైన ముద్రను చెరిపేసుకుని మాస్ లీడర్ గా తెరపైకి వచ్చారు.
లోకేష్ కు ఇది ఆరంభమే… ఇంకా చేయాల్సింది ఎంంతో ఉంది !
అయితే లోకేష్ కు ఇది ప్రారంభం మాత్రమే. ఇంత కాలం తనకు తెలియకుండా తన చుట్టూ ప్రత్యర్థులు ఏర్పరచిన ఓ విష వలయాన్ని ఆయన చేధించారు. ఇక నుంచి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఆయన సామర్థ్యం గురించి తెలుగుదేశం పార్టీ నేతలకు ఎప్పుడూ డౌట్ లేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుంటున్నారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయంటే.. అది మొదట లోకేష్ ఆలోచన వల్ల .. టీడీపీ ప్రారంభించడమే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ స్కీమ్ లోకేష్ ఆలోచన అని.. చాలా మందికి తెలుసు. టీడీపీ కార్యక్రతల సంక్షేమంలో చాంపియన్ గా ఉంది. ఇదంతా లోకేష్ చలువే.
విజయమే అన్నింటికీ సమాధానం !
అయితే ఇప్పుడు ఆయన .. టీడీపీ పునరుజ్జీవం కోసం నడక ప్రారంభించబోతున్నారు. పట్టుమని నాలుగు పదుల వయసు రాక ముందు లోకేష్ రాటుదేలిపోయారు. ఇప్పటి వరకూ ఆయన తనకు తెలియకుండా ప్రజల్లో ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఏర్పర్చిన ఇమేజ్ ను పటాపంచలు చేసుకున్నారు. ఇక ముందు ఆ ప్రజలకు తన సామర్థ్యం చూపించడానికి రోడ్డెక్కుతున్నారు. ఈ పుట్టిన రోజున ఆయన పంతం పడుతున్నారని అనుకోవచ్చు.
విజయానికి అడ్డదారులుండవు. విజయమే అన్నింటికీ సమాధానం. ఈ లక్ష్యంతో కృషి చేసిన వారికి అంతిమంగా విజయమే పలకరిస్తుంది.