చరిత్రలో యుద్ధాలన్నీ మగవాళ్లే చేశారు. కానీ.. ప్రతీ యుద్ధం వెనుకా ఓ ఆడది ఉంటుంది. కాలం మారింది కానీ.. యుద్ధాలకు కారణం మారలేదు. ఓ అమ్మాయి కోసం ఓ కుర్రాడు మారణకాండ సృష్టించాడు. నిలువెత్తు విధ్వంసమయ్యాడు. తనే ‘మైఖైల్’. అతని కథేంటో ‘మైఖెల్’ చూసి తెలుసుకోవాలి. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ఇదో యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్. బుల్లెట్ల మోత మోగింది. దాంతో పాటు.. డైలాగులు కూడా బాగా పేలాయి. లవ్, ఎమోషన్ వర్కవుట్ అయ్యాయనిపిస్తోంది.
”మైఖెల్.. వీడొక స్పైడర్ తెలుసా నీకు..?” – అనే గౌతమ్ మీనన్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
”ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడడమే కొంతమంది పురుషుల తలరాతని రాసి పెడతాడు దేవుడు”
”నిప్పు వెలుగుతూ ఆకర్షిస్తోంది.. కానీ దగ్గరకు వెళ్తే వేడితో కాల్చేస్తుంది”
– ఈ డైలాగులన్నీ అమ్మాయిలని ఉద్దేశించినవే.
”ఇదంతా ఓ అమ్మాయి కోసమా చేస్తున్నావ్? నమ్మలేకపోతున్నా మైఖెల్” అని గౌతమ్ మీనన్ అడిగితే.. సందీప్ నుంచి
”అవును సార్.. అమ్మాయి కోసమే చేస్తున్నా.. అమ్మాయి కోసం కాకపోతే.. ఓ మనిషి ఎందుకు సార్ బతకాలి..?” అనే సమాధానం వస్తుంది. దీన్ని బట్టి.. ఈ మారణకాండకు కారణం ఓ మగువ అని తెలిసిపోతుంది. ఈ యాక్షన్ డ్రామా వెనుక ఓ లవ్ స్టోరీ ఉందన్న విషయం అర్థమయ్యేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్లు, వాళ్లకిచ్చిన గెటప్పులు కొత్తగా అనిపిస్తున్నాయి. కలర్, సినిమా టోన్.. ఇవన్నీ ఆకట్టుకొనేలా ఉన్నాయి. శ్యామ్ సి ఇచ్చిన నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఓ రేంజ్లో ఉన్నాయి. భారీగా ఖర్చు పెట్టారన్న విషయం అర్థమవుతూనే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సినిమా ఇది. దానికి తగ్గట్టుగానే హంగులన్నీ పొందు పరిచారు.