వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హైదరాబాద్ రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇస్తే ఆయన తనకు అన్న దాన కార్యక్రమాలు ఉన్నాయని రాలేనని సమాధానం ఇచ్చారు. ఓ ఐదు రోజుల తర్వాత సీబీఐ వారి విజ్ఞప్తిని పరిశీలిస్తానని ఆఫర్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి సమాధానం ఇప్పుడు దర్యాప్తు వర్గాలలో సంచలనంగా మారుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ ఆయన పేరు అధికారికంగా బయటకు రాలేదు. కానీ దర్యాప్తులో మాత్రం ఆయననే ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో అవినాష్ రెడ్డి విచారణకు పిలిచినా హాజరు కాలేనని చెప్పడం సంచలనం గా మారింది.
వైఎస్ వివేకా హత్య కేసును గత రెండున్నరేళ్లుగా సీబీఐ విచారణ జరుపుతోంది. ఇలా చాలా సింపుల్ కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్. చేధించడం చాలా సులువు. సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించిన వారే నిజమైన నేరస్తులనే చిన్న లాజిక్ తో మొత్తం గుట్టు విప్పేయవచ్చు. కానీ ఇది హైప్రోఫైల్ కేసు. పైగా0 అధికారం వారి చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ ముందుకు సాగలేదు. చివరికి వివేకా కుమార్తె విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వేడుకుంటే సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది.
ఇప్పటికీ అధికారం వారి చేతుల్లో ఉంది. తమకు పెద్దల సపోర్ట్ కూడా ఉందని వారి ధైర్యం . అందుకే సీబీఐ విచారణ అని పిలిచినప్పటికీ.. తాను ఇప్పుడు రానని.. సిల్లీ కారణాలు చెబుతున్నారు. అన్నదానం … ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు అంటూ.. ఐదు రోజుల సమయం అడిగారు. విచారణకు హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతోనే ఇలా అవినాష్ రెడ్డి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే సంచలనం అవుతుంది. విచారమకు సహకరించకపోయినా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు సీబీఐ ఏం చేయబోతోందో ?