టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చిన తర్వాత జనసేన నేతలే ఎక్కువగా చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.. తోట చంద్రశేఖర్ చేరిక.. తెలంగాణ సీఎస్ ఎంపిక అన్నీ ఈ కోణంలోనే జరిగాయంటున్నారు. ఇది పవన్ కల్యాణ్ ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా చేయాలని.. జగన్ కు మేలు చేయాలన్నది కేసీఆర్ ఎత్తుగడ అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణలో అడుగు పెడుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహీ వాహన పూజ, నారసింహ యాత్రలో భాగంగా మంగళవారం కొండగట్టు, ధర్మపురిల్లో పర్యటించనున్నారు . ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. కొండగట్టులో పూజలు తరవాత ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. ఇందు కోసం చలో కొండగట్టు పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బలప్రదర్శన చేయడానికి పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు ఎవరికి వస్తే గెలుపు వారి వెంట ఉంంటుందని చెబుతూంటారు. అందుకే పవన్ ఇటీవలి కాలంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ కాపు నేతలను ఆకర్షించడం వెనుక కూడా …. తెలంగాణలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలన్న వ్యూహం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో తనను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కేసీఆర్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.