నారా లోకేష్ ప్రారంభించనున్న పాదయాత్రకు ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మొత్తంగా 14 షరతులు పెట్టారు. 27 నుంచి చేపట్టే పాదయాత్రకు అనుమతి ఇస్తూ ప్రకటన విడుదల చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని కండీషన్స్ పెట్టారు. వీటిని టీడీపీ పాటించాల్సి ఉంది. నిజానికి ఇలాంటి షరతులు ఎప్పుడూ పాటించేవే. కానీ ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారోనని టీడీపీ నేతలు తర్జన భ ర్జన పడుతున్నాయి.
లోకేష్ పాదయాత్ర 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పాదయాత్రకు వచ్చే ఆదరణ ఎక్కువగా ఉంటే మధ్యలో షరతులు లేకపోతే కృత్రిమంగా ఉద్రిక్తలు రెచ్చగొట్టి.. అడ్డుకునే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలీసులు ఎలాంటి ఆటంకాలు కల్పించినా వాటి రాజకీయంగా ఎదుర్కోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇందు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించుకున్నారు. లోకేష్ పాదయాత్ర కోసం పలు కమిటీల్ని అంతర్గతంగా నియమించుకున్నారు. ప్రతీ రోజూ పోలీసులు చేసే ప్రయత్నాలు వాటికి కౌంటర్ గా ఏమి చేయాలన్నదానిపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.