ఏపీలో ఇప్పుడు బాగా జరిగే వ్యాపారం ఏంటిరా ?అని సరదాగా ఫ్రెండ్స్ చర్చకు పెట్టుకుంటేఏ.. హోటళ్లు , రియల్ ఎస్టేట్, టెక్నాలజీ.. ఈ వ్యాపారేమీ నడవవు రా… వైసీపీ నేతలను మచ్చిక చేసుకుని ఇసుక, అక్రమ మద్యం రవాణా చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది… సీరియస్గా కంక్లూజన్ కు వస్తారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో దొంగ నోట్లు కూడా చేరిన అనుమానాలు వస్తున్నాయి. వరుసగా దొంగ నోట్ల కేసులు వెలుగు చూస్తున్నాయి.
పెన్షన్ల సొమ్మును దొంగ నోట్లు ఇచ్చిన వాలంటీర్ !
ఈ నెల మొదటి రోజు…. నూతన సంవత్సరం రోజున ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండలం నరసాయ పాలెంలో వాలంటీర్ పింఛన్ సొమ్ముగా దొంగ నోట్లను ఇచ్చాడు. పింఛను అందుకున్న మహిళలు వాటిని బ్యాంకులో వేసేందుకు ప్రయత్నించారు. అవి దొంగ నోట్లుగా తేలాయి. ఆ డబ్బులు తనకు పై అధికారులే పంచమని ఇచ్చామని ఆ వాలంటీర్ నెత్తీ నోరు బాదుకున్నారు. చివరికి ఆ వాలంటీరే… దొంగనోట్లు ఇచ్చినట్లుగా పోలీసులు తేల్చారు. కానీ ఆ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు లేదు.
పల్నాడులో పట్టుబడ్డ రూ. కోటిన్నర దొంగ నోట్లు
పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామంలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారికి వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీలులు ఇంకా తేల్చలేదు. ఇంట్లోనే ప్రింట్ చేస్తున్నారని పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ అసలు వారికి ఉన్న రాజకీయ లింకులు.. అంత పెద్ద మొత్తంలో ఇంట్లోనే దొంగ నోట్లు ప్రింట్ చేయడం సాధ్యమేనా అన్న అంశంపై అనేక అనుమానాలున్నాయి.
కర్నాటకలో దొంగ నోట్ల కేసు దొరికిన ప్రొద్దుటూరు వైసీపీ నేత
తాజాగా కర్ణాటకలో ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత, ఓ కుల కార్పొరేషన్ కు డైరక్టర్ గా ఉన్న రసపుత్ర రజని బెంగళూరులో దొంగ నోట్ల కేసులో పోలీసులకు చిక్కారు. ఆమె ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తూంటారు. పదవి కూడా ఆయనే ఇప్పించారు. దీంతో అందరూ రాచమల్లుపై అనుమానంగా చూస్తున్నారు.
ఇటీవల ఏపీలో దొంగ నోట్ల చెలామణి పెరిగిపోయిందని గూగుల్లో దొంగ నోట్లు అని సెర్చ్ చేస్తే… వరుస కొద్దీ వెలుగు చూసిన నేరాలు కనిపిస్తున్నాయి. ఇదంతా పట్టుబడుతున్నదే. పట్టుబడిన దొంగ నోట్లు ఇంకా ఎన్ని ఏపీ ఆర్థిక వ్యవస్థలోకి చొచ్చుకు వచ్చాయి. అసలేం జరుగుతోంది ?