వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవచ్చు.. మహిళల కోటాలా నా భార్యకు టిక్కెట్ ఇచ్చే చాన్స్ ఉంది… అని బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలో అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి .. ఈ సారి తాను పోటీ చేయడం కన్నా.. తన కుమారుడు.. రాజకీయ వారసుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆ విషయం ప్రకాశం జిల్లా రాజకీయ నేతలందిరకీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కుదరదన్నారని..అందుకే తన భార్యకైనా మహిళా కోటా కింద అవకాశం కల్పించాలని ఆయనంటున్నారు. అంతే కానీ తాను పోటీ చేయాలని అనుకోవడం లేదు.
బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కాలంంగా జగన్ వెంట ఉన్న నేత. అంతే కాదు ఆయన సమీప బంధువు కూడా. ఆయనకేమీ వయసు మళ్లీపోలేదు. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇప్పించాల్సిన అవసరం లేదు. హైకమాండ్ కూడా అలా కోరుకోదు. కానీ ఎందుకో కానీ… తాను పోటీచేయనని… తన కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు. ఒక్క బాలినేని మాత్రమే కాదు.. చాలా మంది అదే డిమాండ్ వినిపిస్తున్నారు.
సిక్కోలు సీనియర్ నేతలంతా ఇప్పటికే తాము పోటీ చేయమని జగన్ కుచెప్పామంటున్నారు. టిక్కెట్ ఇస్తే సరే లేకపోయినా నో రిగ్రెట్స్ అంటూ మైలవరం ఎమ్మెల్యే లాంటి వాళ్లు చేసిన ప్రకటనలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఇక పార్టీని ధిక్కరిస్తున్న వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. టిక్కెట్ ఇచ్చినా ఉపయోగం లేదనుకునేవారి సంఖ్యఇకా ఎక్కువగా ఉంది. టిక్కెట్ ఇచ్చేది లేదని చేస్తున్న హెచ్చరికల్ని వైసీపీ ఎమ్మెల్యేలు అత్యధికులు పట్టించుకోవడం లేదు . ఈ పరిస్థితి వైసీపీలో గందరగోళ పరిస్థితి కి కారణం అవుతోంది.
ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నియోజకవర్గంలో తాము తప్ప వైసీపీకి మరొకరు లేరన్న ధీమాతో ఎక్కువ మంది ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారన్న వాదన ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బతిమాలి అయినా తమనే పోటీ చేయిస్తారని.. అందుకే .. బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీలో … టిక్కెట్ కావాలి అనే డిమాండ్ తగ్గిపోయి.. పోటీ చేయమని బతిమాలుతారు అన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.