తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ గ్రామాల ప్రజలు కొంత కాలంగాను తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అక్కడ విస్తరించడానికి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్దంచేశారు. నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే నాందెడ్‌లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి.. చేరిక ల కోసం కొంత మందిని ఒప్పించారు
సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్చార్జిలుగా నియమించారు. కేసీఆర్ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. మంగళవారం జోగు రామ న్న నేతృత్వంలో బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితర నేతలు నాందేడ్ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని అక్కడి నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే పోటీ వద్దని కేసీఆర్ అనుకుంటున్నారు. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నా.. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా పార్టీ బలోపేతం గురించే ఎక్కువగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు.