ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు రమ్మంటే వెళతామా.. ఐదు రోజుల తర్వాత అయితే ఆలోచిస్తా అన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి …సీబీఐ ఖచ్చితంగా ఐదు రోజుల తర్వాత డేట్ ఇచ్చింది. 28వ తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ఆఫీసుకు రావాలని సూచించింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎంపీ.. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలన్న కారణం చూపి ఆయన డుమ్మా కొట్టాడనికి కూడా చాన్స్ లేదు.
ఐదు రోజుల తర్వాత సీబీఐ నోటీసులు ఇస్తే ఇదే కారణం చెప్పి ఆయన తప్పించుకోవచ్చని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీబీఐ అలాంటి చాన్స్ ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే తేదీ ఖరారు చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఖచ్చితంగా సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. హాజరు అయితే అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళన ఆయనతో ఉందని చెబుతున్నారు. అందుకే న్యాయనిపుణలుతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కేసు విచారణ హైదరాబాద్కు బదిలీ కావడంతో ఇక అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతాయి. నిందితుల్ని కూడా హైదరాబాద్ జైలుకు తరలించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ కేసు కీలక పరిణామాలకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత… అలాగే గంగిరెడ్డి బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తర్వాత రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.