గవర్నర్ జెండా ఎగరేస్తారని.. ప్రసంగిస్తారన్న కారణంగా రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించడానికి ససేమిరా అంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలను పరేడ్ తో సహా నిర్వహించాల్సిందేనని మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీంతో గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శకటాలు లేకపోయినా… ఎట్టి పరిస్థితుల్లో పరేడ్ కూడా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూడా పరేడ్ కు గంటల్లోనే రెడీ కావాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు చేయడం కూడా అంత తేలిక కాదు. దీంతో ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ప్రభుత్వం వేడుకలు నిర్వహించకపోతే.. కోర్టును ధిక్కరించినట్లు అవుతుంది.
సాధారణంగా గణతంత్ర దినోత్సవం గవర్నర్ చేతుల మీదుగా సాగుతుంది. ప్రభుత్వం ప్రతీ సారి పరేడ్ గ్రౌండ్స్ లేదా పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహిస్తుంది. వేడుకల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదువుతారు. పోలీసులు పరేడ్ నిర్వహించి.. గవర్నర్‌కు గౌరవ వందనం సమర్పిస్తారు. అలాగే శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రతీ సారి ఇలాగే జరిగేది.అయితే గత ఏడాది మాత్రం తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో గవర్నర్ రాజ్ భవన్‌లో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో జెండా వందనం చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేశారు.
గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ లోపు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో … ఎట్టి పరిస్థితుల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.