2023 సంవత్సరం ఆస్కార్ నామినేషన్ లు భారత ప్రేక్షకులకు సైతం ఆసక్తికరంగా మారాయి. మొత్తం మూడు విభాగాల్లో భారత్ నామినేషన్లు సాధించగా, ఒక విషయంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పొరపాటు చేసిందనే అభిప్రాయాలు ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
ఆస్కార్ బరిలో ఈ సంవత్సరం నిలవనున్న పోటిదారుల వివరాలు నిన్న వెల్లడైన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట నిలిచిందన్న సంగతి భారతీయులకు, ప్రత్యేకంగా తెలుగువారికి గర్వకారణంగా మారింది. అయితే దీంతోపాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో భారత్ నుండి ఆల్ దట్ బ్రీత్స్ అన్న ఫిలిం, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఎలిఫెంట్ విస్పర్స్ అన్న షార్ట్ ఫిలిం భారత్ నుండి నామినేట్ అయ్యాయి. అయితే ఆస్కార్ నిబంధనలను అనుసరించి, కొన్ని కేటగిరిల లో మాత్రమే ఈ విధంగా ప్రైవేట్ నామినేషన్లను అనుమతిస్తారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం వంటి కేటగిరీలలో అధికారికంగా ఆయా దేశ ప్రభుత్వాలకి లోబడిన సంస్థలు పంపించే ఎంట్రీ లను మాత్రమే అనుమతిస్తారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో భారత్ తరపున అధికార ఎంట్రీగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెల్లో షో అనే గుజరాతి చిత్రాన్ని పంపగా అది నామినేషన్ లిస్ట్ లో సైతం చివరిదాకా నిలబడలేకపోయింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాని పంపడం, అది నామినేషన్ దశలోనే వెనక్కి తిరిగి రావడం చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతే. అయితే దీనికి మన సినిమాల్లో ఆ స్థాయి పస లేకపోవడం ఒక కారణం అయితే, కొన్నిసార్లు పస వున్న చిత్రాలను పక్కనపెట్టి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తమకు నచ్చిన చిత్రాలను పంపడం కూడా ఒక కారణం అన్న విమర్శలు చాలా కాలం నుండి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గత సంవత్సరాల సంగతి పక్కన పెడితే, ఈ సంవత్సరం మాత్రం ఆర్.ఆర్.ఆర్ విషయంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కచ్చితంగా పొరపాటు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనేక దేశాల్లో ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు అందరి మెప్పు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధికారికంగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నామినేషన్ చేసి ఉంటే, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో అవార్డు పొందే సంగతి ఎలా ఉన్నా కనీసం ఫైనల్ నామినేషన్ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ కచ్చితంగా నిలిచి ఉండేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా స్థానంలో పంపిన గుజరాతి సినిమా చెల్లో షో నామినేషన్ లిస్ట్ లో కూడా నిలవలేకపోయిందని వారు గుర్తు చేస్తున్నారు.
ఏదేమైనా భవిష్యత్తులో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరింత ముందుచూపుతో వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాలి.