ఏపీ దేవాదాయశాఖకు ఇప్పుడు ఎప్పుడూ లేనంత పని పడింది. నిజం చెప్పాలంటే పడలేదు… సృష్టించుకుంది. అదేదో ప్రభుత్వ అధీనంలోనే ఆలయాల వేడుకలకో.. మరోదానికో కాదు… ఓ స్వయం ప్రకటిత పీఠానికి… ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని ప్రైవేటు ఆశ్రమం అయిన శారదా పీఠం వార్షికోత్సవాల కోసం దేవాదాయ శాథ హైరానా పడిపోతోంది. ఏర్పాట్లు చేయడంలో తమ వంతు సాయం అందిస్తోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వస్తారన్న కారణంతో ఆ పేరు చెప్పి.. ప్రజాధనం ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. పచ్చని చెట్లను కూడా రోడ్ల మధ్య ఉంటే నరికేశారు. ఇక శారదాపీఠం చుట్టుపక్కల చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పాల్సిన పని లేదు. అది ప్రైవేటు పీఠం. ఆ పీఠానికి భక్తులు ఇచ్చే విరాళాలు ప్రభుత్వానికి రావు. ఏ కార్యక్రమం అయినా పీఠమే చేసుకుంటుంది. దేవాదాయశాఖ జోక్యం ఎందుకో .. ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారో జనానికి తెలియడం లేదు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ పూర్తిగా శారదాపీఠం స్వరూపానంద కనుసన్నల్లోనే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన జోక్యంతో ఇటీవల ఓ సలహాదారును కూడా నియమించారు. శారదా పీఠానికి కొత్త వలస దగ్గర ఖరీదైన భూముల్ని కేటాయించారు. అక్కడికి కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు కూడా వేయిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రజలకు ఉపయోగపడే పని మాత్రం చేయడం లేదు…కానీ ఇలా స్వామిజీలకు.. వ్యక్తిగత పనులకు మాత్రం ప్రభుత్వ పెద్దలు భారీగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.