కేంద్ర బడ్జెట్ లో ఏపికి అరకొర కేటాయింపులు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసారు. నిజమే… విభజన కారణంగా దెబ్బతిని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు జరుగలేదు. ఆ కారణంగా రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు కూడా బడ్జెట్ కేటాయింపుల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి అది తన ప్రభుత్వంపైకి మళ్ళకుండా ఉండేందుకే ఆయన కూడా ప్రజలతో గొంతు కలిపి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పకతప్పదు. గతంలో కూడా రెండు మూడు సార్లు ఆయన ఇదేవిధంగా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తరువాత తెదేపా మంత్రులు, నేతలు కూడా ఆయనకి కోరస్ పాడటం, అప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు వారికి గట్టిగా జవాబు చెప్పడం, తరువాత కేంద్రప్రభుత్వం సహాకారం మనకి చాలా అవసరం కనుక దానిపై విమర్శలు చేయవద్దని ముఖ్యమంత్రి వారిని హెచ్చరించడం, మళ్ళీ యధాప్రకారం అందరూ కలిసి నరేంద్ర మోడి భజన చేయడం వంటివన్నీ కూడా ‘ఒక పద్ధతి ప్రకారం’ జరిగిపోయాయి. బహుశః ఇప్పుడు కూడా అదే మళ్ళీ జరుగబోతోందని చెప్పవచ్చును.
తెదేపా ప్రభుత్వానికి ప్రజాగ్రహం తమపైకి మళ్ళకుండా చూసుకోవాలనే తాపత్రయమే తప్ప రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే బాధ కలగకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఈవిధంగా ఎందుకు ఆరోపించవలసి వస్తోందంటే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మరుక్షణమే ప్రధాని నరేంద్ర మోడిని మెచ్చుకోవడం, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పడం వలననే.
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు నుండే హామీలు అమలుచేయమని కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. ఇప్పటికే దాదాపు రెండేళ్ళు పూర్తయిపోయాయి. ఇంకా ఎంత కాలం ఒత్తిడి చేస్తారో, ఇంకా రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్రం ఎప్పుడు నిలబెట్టుకొంటుందో ఎవరికీ తెలియదు. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదనే సంగతి ముఖ్యమంత్రికి ఎప్పుడో తెలుసని అందుకే ఆయన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి మాట్లాడుతున్నారని” తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక ఆర్ధిక ప్యాకేజి, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీల అమలు చేయరనే సంగతి కూడా ముఖ్యమంత్రికి తెలిసే ఉంటుంది.
తెదేపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు, తెదేపా నేతలు అందరూ కూడా పోలవరం ప్రాజెక్టుని ఐదేళ్ళలో పూర్తి చేసి చూపిస్తామని గొప్పలు చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు ఎవరూ కూడా ఆమాట గట్టిగా చెప్పడం లేదు. పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలు లేవని దృవీకరిస్తున్నట్లుగా మధ్యలో పట్టిసీమ ప్రాజెక్టుని మొదలుపెట్టారు. అందుకు తగ్గట్లుగానే కేంద్రం ఈసారి బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది.
కనుక రాష్ట్రానికి ఏమేమి వస్తాయో, ఏమి రావో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన మంత్రులకి ఖచ్చితంగా తెలిసే ఉంటుందనే చెప్పవచ్చును. కానీ దానిని బయటపెడితే బీజేపీ తమతో తెగతెంపులు చేసుకొంటుందనే భయంతోనే ఆ విషయాలను దాచిపెట్టి, ఇటువంటి సందర్భాలలో ప్రజాగ్రహానికి గురికాకుండా తప్పించుకొనే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వంపై ఏదో మొక్కుబడిగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన్న ప్రజలను సంతృప్తిపరచవచ్చనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు.
ప్రజలు చంద్రబాబు నాయుడుపై చాలా బారీ ఆశలు, అంచనాలు పెట్టుకొని అధికారం కట్టబెట్టారు. కనుక మిగిలిన ఈ మూడేళ్ళ సమయంలో ఆయన ఇదేవిధంగా ఒకసారి మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మళ్ళీ అదే నోటితో ఆయనను పొగుడుతూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. బీజేపీతో స్నేహం కోసం, ప్రధాని నరేంద్ర మోడిని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడితే చివరికి బీజేపీతో బాటు తెదేపా కూడా ప్రజాగ్రహానికి గురికాకుండా తప్పించుకోలేదనే సంగతి గ్రహిస్తే మంచిది.