పొత్తుల్లేకపోతే రాజకీయంగా తాను ఇక ప్రజా ప్రతినిధిని అనిపించుకోలేనని ఆందోళనతో పక్క పార్టీల వైపు చూస్తున్న కన్నాలక్ష్మినారాయణకు హైకమాండ్ భరోసా సందేశం పంపింది. ఆరెస్సెస్ తరపున పార్టీవ్యవహారాలను పర్యవేక్షించే శివప్రకాష్ జీ కన్నాతో విజయవాడలో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాని పరిస్థితి రాదని… హైకమాండ్ సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్ ను కాపాడుతుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల సోము వీర్రాజు తీరుపైనా కన్నా విమర్శలు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరు కాలేదు. వీటితో పాటు కన్నా రాజకీయ భవిష్యత్ ఆందోళనలపైనా సుమారు రెండున్నర గంటలపాటు శివప్రకాష్ జీ చర్చించారు. ఇందులో చాలాా విషయాలు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ధీమాగా కనిపించారు. తాను ఎప్పుడూ పార్టీ మారతానని చెప్పలేదని ప్రకటించారు.
తనకి ఉన్న స్నేహం కారణంగానే కొందరు నేతలతో కలవడం జరిగిందన్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్‌తో సమావేశం స్నేహపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు కన్నా. అంతే కానీ పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సూచనలు అడిగేందుకే తనను శివప్రకాష్ కలిశారే తప్ప ఎలాంటి బుజ్జగింపులు కూడా జరగలేదన్నారు. చాలా మంది అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నారని అన్నారు. అన్నింటిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి కన్నాకు ఎలాంటి భరాసా వచ్చింది. ఆయన నెక్ట్స్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.