వారిద్దరూ అత్యంత సెలబ్రిటీ జంటల్లో ఒకరిగా చాలా రోజుల పాటు హల్చల్ చేశారు. పైగా ఇద్దరిలో ఒకరు స్పోర్ట్స్, మరొకరు సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కావడంతో.. అన్ని రంగాల వారి కళ్లూ వీరి చుట్టూ తిరిగాయి. పైగా వారు కూడా తమ గురించి, తమ తిరుగుళ్ల గురించి.. ఎవరేం అనుకున్నాసరే ఎన్ని విమర్శలు రేగుతూ ఉన్నాసరే.. వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేవారు. ఆజంట అందరికీ చిరపరిచితమే. విరాట్ కొహ్లి, అనుష్క శర్మ ఎంతగా సెలబ్రిటీ జంటగా చెలామణీ అయ్యారంటే.. కోహ్లి ప్రతి టూర్లోనూ ఆమె కూడా ప్రత్యక్షమవుతూ.. అతడి ఆటను దెబ్బతీస్తున్నదని బీసీసీఐ కొత్త నిబంధనలను వెతుక్కునేంతగా. అయితే ఇటీవలి వారిద్దరి మధ్య బ్రేకప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కొహ్లి తన ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి అనుష్క పేరును అన్‌ఫ్రెండ్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మళ్లీ అనుష్కకు కోహ్లి చాటుమాటుగా కన్ను గీటుతున్నట్లుగా కనిపిస్తోంది. అంటే అచ్చంగా కన్ను గీటడమే కాకపోవచ్చు గానీ.. ఆమె దృష్టిని మళ్లీ తనవైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత జట్టు టీ20 సిరీస్ కోసం ఢాకాలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ భారత హైకమిషన్‌లో మ్యూజికల్ నైట్ జరిగితే.. అక్కడ కోహ్లి కూడా గొంతు చేసుకున్నాడు. స్వరం సవరించుకుని ఓ చక్కటి హిందీ పాట పాడాడు. ‘జో వాదా కియా, వో నిభానా పడేగా..’ మాట ఇచ్చిన వాళ్లు దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.. అనే అర్థం వచ్చేలా సాగే ఈ విరహగీతం.. అనుష్కను మళ్లీ ఇంప్రెస్ చేయడానికి కోహ్లి చేస్తున్న ప్రయత్నంగానే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది తనకు చాలా ఇష్టమైన పాట అని కోహ్లి చెప్పుకున్నాడు. మరి.. కనీసం ఈ పాట ద్వారా పంపుతున్న సంకేతాలకు అయినా.. అనుష్క స్పందించి తిరిగి అతడి సరసకు చేరుతుందో లేదో చూడాలి.