భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని ఆ పార్టీ మీడియా రోజూ పేజీల కొద్దీ వ్యాసాలు రాస్తూ ఉంటుంది. అయితే ఆ మీడియాలో చెప్పినంత హైప్ కనిపించడం లేదని.. జాతీయ స్థాయిలో వెల్లడవుతున్న సర్వేలు నిరూపిస్తున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలనే తీర్మానం చేసి ఐదు నెలలు అవుతోంది. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా జరిపిన సర్వేల్లో బీఆర్ఎస్ ఉనికి కనిపించలేదు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అసలు బీఆర్ఎస్ ప్రస్తావన తెలంగాణ దాటి ఇతర రాష్ట్రాల్లో వినిపించంలేదు
మోదీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ను దేశ ప్రజలు ఎంచుకుంటారని.. తెలంగాణ మోడల్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయనను ప్రధానమంత్రి రేసులో ఉన్న వారిగా ఎవరూ ఓటు వేయలేదు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా ఆయనను సీఎం అభ్యర్థిగానే చూస్తున్నారని స్పష్టమయింది. ముందుగా జాతీయ స్థాయి సర్వేల్లో బీఆర్ఎస్ కనీసం కొన్ని రాష్ట్రాల్లో అయినా ప్రభావితం చేయగలిగిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కు గుర్తింపు వచ్చే చాన్స్ ఉంది.
కేజ్రీవాల్ మాత్రం ప్రతీ సర్వేలో చోటుదక్కించుకుంటారు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఆయన ఓ నేతగా ప్రజలు భావిస్తూ ఉంటారు ఆయన పార్టీ కూడా పలు రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కేజ్రీవాల్ .. ఖమ్మం బహిరంగసభలో… కేసీఆర్ తమ పెద్దన్న అన్నారని.. ఆయన కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించారనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో కేసీఆర్ కన్నా కేజ్రీవాల్ కే ఎక్కువ గుర్తింపు ఉంది. అయినా ఆయన కేసీఆర్ నాయకత్వాన్ని ఎలా అంగీకరిస్తారు ?. బీఆర్ఎస్ పార్టీ పెట్టినా మొత్తంగా తెలంగాణలోనే కార్యక్రాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చేరితే తప్ప… బీఆర్ఎస్ కు జాతీయస్థాయిలో గుర్తింపు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.