తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే… రాజకీయ చాణక్యుడని పేరు. ఆయన రాజకీయాల్ని రాజకీయంగా చేస్తారు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్ విషయంలో ఆయన ఆవేశంతో చేసిన రాజకీయాల వల్ల ఇప్పుడు పూర్తిగా ఆయన తనదే తప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గవర్నర్ తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నారు. అందులో డౌట్ లేదు. కానీ పోటీగా తాను గవర్నర్ ను ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ అనుకోవడంతోనే సమస్య వచ్చినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించలేదు. కానీ ఇక్కడ చూడాల్సింది గవర్నర్ తమిళిసై ను కాదు.. దేశాన్ని .కానీ కేసీఆర్ అలా కూడా చూడలేకపోయారు. చివరికి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా లేకుండా చేశారు. గవర్నర్ పై కోపంతో ఆయన ఆయన ఇలా చేశారు.
బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం అవసరం లేకపోతే.. కేసీఆర్ తాను అనుకున్నట్లుగా చేసేవారు. కానీ . ఇంత చేస్తున్న ప్రభుత్వానికి తాను ఏం చేయగలనో నిరూపించాలని గవర్నర్ అనుకున్నారు. ఈ విషయంలో గవర్నర్ కు కూడా కొంత ప్రజల మద్దతు లభిస్తుంది. తమ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలే అలాంటి పరిస్థితి కల్పించారు. గవర్నర్ ను విమర్శిస్తే సీఎం సంతోషపడతారని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యలు పరిరిస్థితిని మరింత దిగజార్చాయి.
చివరికి ప్రభుత్వం తప్పు చేసినట్లుగా తొలంచుకుని గవర్నర్ అధికారాల్ని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు సగౌరవంగా వెళ్లి ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గవర్నర్ కు ఆహ్వానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు చేసినట్లుగా ప్రభుత్వం నిలబడింది. దీనికి కేసీఆర్ అధికారంతో వచ్చిన ఆవేశం కారణంగా తీసుకున్న నిర్ణయాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.