రాజకీయాల్లో శత్రుపక్షాలకు చెందిన వారి మీద ఎంతగా చెలరేగిపోతూ ఉన్నప్పటికీ కూడా నేరుగా తారసపడ్డప్పుడు మాత్రం నాయకులు ప్రేమానురాగాలు కురిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది అసలే రాజకీయ రంగం. అందులో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. పైగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని గమనిస్తే ఈ బంధాలు మరీ ‘క్షణక్షణమున్ మారుచుండు జవరాండ్ర చిత్తముల్’ అన్నట్లుగా చాలా వేగంగా మారిపోతున్నాయి. కాబట్టి అందరితోనూ మంచిగా ఉండడమే మంచిది అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు. కానీ తన సొంత మనుషులతో కూడా శత్రువుల్లా ప్రవర్తించే వైఖరి ప్రదర్శిస్తే ఎలాగ? నాలుగ్గోడల మధ్య తన పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించడంకోసం నిర్వహించిన సమావేశంలో, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుని పార్టీని కాపాడుకోవడం కోసం నిర్వహించిన సమావేశంలోనే జగన్ అసహనం హద్దులు దాటి, అహంకారం కూడా ప్రదర్శిస్తే ఎలాగ? ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అదే చర్చ జరుగుతోంది.
వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం తన పార్టీనుంచి అధికార పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద చాలా అసహనంతో ఊగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరితో లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఏకంగా 13 మంది గైర్హాజరు కావడం ఆయనను మరింతగా కోపానికి గురిచేసి ఉండవచ్చు. ఆ కోపాన్ని వచ్చిన వారి మీద ప్రదర్శించడం, పార్టీని బాగు చేసుకోవడానికి తమకు తోచిన సలహాలు ఇచ్చిన వారి మీద కత్తులు దూయడం గా మారితే ఎవరు మాత్రం హర్షిస్తారు? అందుకే జగన్‌లోని అహంకారమే పార్టీకి ప్రమాదకరంగా మారుతోందని ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్యేలతో భేటీకి 47 మంది హాజరు కాగా, తన ప్రసంగం పూర్తయిన తర్వాత జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరినట్లుగా తెలుస్తున్నది. మీరు ఎమ్మెల్యేలతో తరచూ కలుస్తూ ఉండాలి అని ఒకరు సలహా చెప్పగానే.. జగన్ అసహనం హద్దు దాటిపోయిందిట. మరో ఎమ్మెల్యే కూడా అదే మాట అనడంతో.. ‘టైం వచ్చింది కదాని.. నాకే సలహాలు ఇస్తారా’ అంటూ కస్సుమన్న జగన్ అర్థంతరంగా లేచి.. సమావేశంలోంచి వెళ్లిపోయారుట. ఆయన తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఎలా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జగన్ ఇదివరకటిలాగే ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పార్టీ మరింతగా పతనం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు