బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చిక్కులు వస్తున్నాయి. ఆయనపై సొంత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టుగా ఆ ప ార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఈ మ్యాటర్ లో ఈటలకు వ్యతిరేకంగా కొంత మందిని ఎగదోస్తున్నారని చెబుతున్నారు. తాజాగా విజయశాంతి స్పందించారు. ఈటల చెప్పినట్లుగా నిజంగా కోవర్టులు ఉంటే వారిని పేర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలా చేస్తే మీరు పార్టీకి మేలు చేసిన వారు అవుతారని ఈటల రాజేందర్ ను ఉద్దేశించి విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించకుండా విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఓ సందర్భంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పష్టత ఇచ్చారు. బీజేపీలో కోవర్టులు ఎవరూ ఉండరని, బీజేపీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం నడిచింది. ఏ పార్టీలో లేనట్టుగానే ఓ జాయినింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని రాజేందర్ తప్పుపట్టారు. ఆయనకు మద్దతుగా రేవంత్ మాట్లాడతంతో పరిస్థితి మరింత తేడాగా మారింది. దీంతో ఈటల ఇరుక్కుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.