సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫొటో’కి మంచి పేరొచ్చింది. అయితే అది థియేటర్లో రాలేదు. ఓటీటీకి పరిమితమైంది. తొలిసారి సుహాస్ తన అదృష్టాన్ని థియేటర్లలో పరీక్షించుకోబోతున్నాడు. ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఓ తెలివైన పని చేశారు. టికెట్ రేట్లని బాగా తగ్గించేశారు. సింగిల్ స్క్రీన్‌లో ఈ సినిమా కేవలం రూ.110 మాత్రమే. మల్టీప్లెక్స్‌లో అయితే రూ.150. ఈ ధరలు జీఎస్టీలతో కలిపి లెక్కేసుకోవాలి. కేవలం కుటుంబం అంతా కలిసి థియేటర్లకు రావాలనే ఆలోచనతో… టికెట్ రేట్లని బాగా తగ్గించారు.
ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే విజయవాడ, భీమవరం, గుంటూరు, కాకినాడలో ప్రదర్శించారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ప్రీమియర్ షోలతో వచ్చిన బూస్టప్, టీజర్- ట్రైలర్లు ఇచ్చిన నమ్మకంతో.. దర్శక నిర్మాతలు ఖుషీగా ఉన్నారు. ఓ చిన్న సినిమాకి విడుదలకు ముందే ఇన్ని ప్రీమియర్లు పడడం ఇదే తొలిసారి. మరి.. సుహాస్‌కి ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.