విశాక ఏకైక రాజధాని అని పెట్టుబడిదారులకు సీఎం జగన్ చెబుతున్నారు. విశాఖలో నిర్వహించబోతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు రావాలంటూ దౌత్యవేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఓ గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తన ప్రసంగంలో రాజధాని విశాఖ కాబోతోందని.. అక్కడకు రావాలని … తాను కూడా త్వరలో అక్కడికి మారబోతున్నానని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఈయన బాధ్యతల ముఖ్యమంత్రేనా అని చర్చించుకోవడం కనిపించింది.
సుప్రీంకోర్టులో ఉన్న రాజధాని అంశం !
రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ప్రస్తుతం రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ రాజ్యాంగ ప్రకారం సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని..రాజ్యాంగ వ్యవస్థలను సైతం ధిక్కరించి.. తాను విశాఖ వెళ్లబోతున్నానని.. అదే రాజధాని అని ప్రకటించారు. ఆయన తీరు చూసి చట్టాలను ..రాజ్యాంగాన్ని గౌరవించని సీఎం గురించి దౌత్యవేత్తలకు సదభిప్రాయం ఏర్పడుతుందా ?
మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసిన జగన్ !
ఇప్పటి వరకూ మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజల్ని మోసం చేశారు. ఆయన ఉద్దేశంలో రాజధాని అంటే విశాఖ మాత్రమే. వైసీపీ మంత్రులు నేతలు కొంత కాలంగా అదే చెబుతున్నారు. ఒకటే రాజధాని అంటున్నారు. రాజధానిగా విశాఖ లేకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉత్తరాంధ్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏకైక రాజధాని అని చెబుతున్నారు. న్యాయరాజధాని ఇప్పుడు పెట్టడం లేదని.. సుప్రీంకోర్టులోనే ఏపీ ప్రభుత్వం తేల్చింది. అంటే ఇప్పుడు న్యాయరాజధాని.. లెజిస్లేటివ్ రాజధాని అనేవే లేవని.. అంతా విశాక రాజధాని అని జగన్ వెళ్లి విదేశీ ప్రతినిధుల ముందు ప్రకటించుకున్నారు.
పెట్టుబడిదారులను ఆహ్వించేది విశాఖకా.. ఏపీకా ?
సీఎం జగన్ ఢిల్లీలో దౌత్తవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చూసే ఆయనకు తాను కనీసం సీఎంను అని.. రాష్ట్రం మొత్తానికి తానుపెద్ద అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని ఎవరైనా అనుకుంటే వారి తప్పు లేదు.పెట్టుబడిదారుల్ని విశాఖ రమ్మని పలిచారు. విశాఖలో రాజధాని పెడుతున్నామని చెప్పారు. పెట్టుబడిదారులు విశాఖకు వచ్చినా వారు మొత్తం ఏపీ లో పెట్టుబడులు పెడతారు కానీ విశాఖలో మాత్రమే పెట్టరు. కానీ జగన్ తీరు చూస్తూంటే ఒక్క విశాఖకు మాత్రమే పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన తీరు ఉంది.
సీఎం జగన్ తీరు మొదటి నుంచి ఏ విషయంలోనూ పారదర్శకంగా లేదు. పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేసేలా ఉంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలకు చెప్పిన దాన్ని బట్టి.. ఆయన తీరు చట్టాలు, రాజ్యాంగానికి వ్యతిరేకమని మరోసారి స్పష్టమయింది.