ఏపీ రాజధాని అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నా.. బెంచ్ ఇతర కేసుల్లో బిజీగా ఉండటంతో విచారణకు రాలేదు. తదుపరి ఎప్పుడు విచారణ జరుగుతుందన్న దానిపైనా స్పష్టత లేదు. ఈ కేసులో ఇప్పటికే 261 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారందరూ తమ అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎంత దాఖలు చేశారో.. అన్నదానిపై స్పష్టత లేదు. కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. కేంద్ర స్పందన కీలకంగా మారింది.
ఓ వైపు కేసు విచారణకు వచ్చే రోజే వ్యూహాత్మకంగా సీఎం జగన్ ఢిల్లీలో ఇన్వెస్టర్స్ మీట్ పేరుతో.. దౌత్యవేత్తల సమవేశం పెట్టి.. సుప్రీంకోర్టును సైతం పట్టించుకోనట్లుగా రాజధానిపై ప్రకటనలు చేయడం సంచలనంగా మారింది. అయితే సీఎం వ్యాఖ్యల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ బెంచ్ పైకి రాలేదు. గతంలో రాజధాని నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న అంశంపై.. స్టే ఇచ్చారు. అదీ కూడా జనవరి31వ తేదీ వరకే. ఇప్పుడు ఆ పిటిషన్లు బెంచ్ పై విచారణకు రాకపోవడంతో.. ఆ స్టే కూడా ఉంటుందా ఉండడా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పదే పదే సీఎం సహా మంత్రులంతా.. పెద్ద ఎత్తున రాజధాని ఇష్యూలో ప్రకటనలు చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నఅంశంపై అధికారంలో ఉన్న వారు ఇలా మాట్లాడటం నైతికత కాదు అనే వాదనలు వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. సుప్రీంకోర్టు విచారణ తర్వాతే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.