తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో క్లిష్టమైన నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేటీఆర్ ఖరారు చేస్తున్నారు. ఈటల రాజేందర్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్ ఈ సారి అభ్యర్థిని మార్పు చేసింది. హుజూరాబాద్‌లో బహిరంగసభ పెట్టి అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని కేటీఆర్ ప్రకటించారు. 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్లో ఈటలపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్కి కంచుకోట. ఎన్నికలు,ఉప ఎన్నికలు ఏదైనా ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్కే పట్టం కట్టారు. అయితే నియోజకవర్గాన్ని బీఆర్ఎస్లో ఉండి కంచుకోటగా మార్చుకుంది ఈటల రాజేందర్. ఆయన బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేయడంతో బీఆర్ఎస్ కంచుకోట కాస్తా ఈటల రాజేందర్ కంచుకోటగా మారింది. ఎమ్మెల్యేగా గెలుపొంది నేరుగా ముఖ్యమంత్రికే సవాల్ విసురుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అభ్యర్థిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపారు. ఎంత ప్రయత్నించినా .. వర్కవుట్ కాలేదు. అయితే బీసీ అభ్యర్థి కావడంతో తర్వాత కూడా ఆయనే అభ్యర్థి అవుతారని … ఇంచార్జి పదవి ఇచ్చారు. కానీ ఈటల ముందు సరిపోవడం లేదని చివరికి గెల్లు శ్రీనివాస్ కు హ్యాండిచ్చి… కౌశిక్ రెడ్డికే అభ్యర్థిత్వం ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ తరపున కౌశిక్ రెడ్డినే పోటీ చేశారు. ఈయన కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు.