ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు అహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రతిపాదన వచ్చింది. అయితే పొంగులేటి మాత్రం రెండు సార్లు షర్మిల, విజయలక్ష్మిలతో సమావేశం అయ్యారు. ఓ సారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. షర్మిల పార్టీ పెట్టే సమయంలో పొంగులేటి చాలా సాయం చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీలకు ఏపీలో పలు కాంట్రాక్టులు దక్కాయి. ఇటీవల బిల్లులు కూడా మంజూరైనట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో.. షర్మిల పార్టీలోకి వెళ్లాలన్న ఒత్తిడి ఉండటంతో ఆయన ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. పొంగులేటి వియ్యంకులు కడప జిల్లాకు చెందిన వారు. పొంగులేటి ఇప్పటికే బీఆర్ఎస్ కు దూరం అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఏదో ఓ పార్టీలోకి మారిపోవాల్సిందే. అయితే ఏ పార్టీ అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఖమ్మంలో బిగ్ లీడర్స్ అంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. అందరికీ టిక్కెట్లు సర్దుబాటు చేయడం కష్టం. అందుకే కొంత మంది ఇతర పార్టీల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పొంగులేటి మొదట బయటపడ్డారు. కానీ ఏ పార్టీనో అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయి.. కానీ ఏ పార్టీనో ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది.