అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ. ఇరవై వేల కోట్ల రూపాయలను షేర్ మార్కెట్ నుంచి ఎఫ్పీవో ద్వారా సమీకరించింది. ఆదానీ కంపెనీలకు ఉన్న షేర్ల విలువతో పోలిస్తే. .. ఈ ఎఫ్ పీ వో ఓవర్ సబ్ స్క్రైబ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది హిండెన్ బెర్గ్ రిపోర్టు బయటకు రాక ముందు. ఆ రిపోర్టు బయటకు వచ్చాక.. అదానీ కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో ఈ ఎఫ్ పీవో ఏమవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తం మూడు రోజుల ఈ ఎఫ్ పీ వోలో మొదటి రోజు.. ఒక్క శాతం.. రెండో రోజు మరో శాతం మాత్రమే సబ్ స్క్రయిబ్ అయింది. కానీ మూడో రోజు మాత్రం మొత్తం షేర్లు బుక్ చేసేసుకున్నారు.
సెబీలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షెర్లను ఎవరూ కొనలేదు. కేవలం కేటాయించిన షేర్లలో పదకొండు శాతమే కొన్నారు. కానీ.. కంపెనీ ఉద్యోగులూ ఈ ఎఫ్పీఓపై పెద్దగా ఆసక్తి చూపలేదు. వీరికోసం రిజర్వు చేసిన షేర్లలో సగం మంది మాత్రమే కొన్నారు. అయితే సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం చివరి రోజున మొత్తం షేర్లను కొనేశారు.
ఈ ఇష్యూ కింద మొత్తం 4.55 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి పెట్టగా.. మదుపరుల నుంచి 5.08 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్స్ అందాయి. మొత్తం ఎఫ్పీఓలో 16 శాతం షేర్లను అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అనే సంస్థ తీసుకుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ.3,200 కోట్లు ఖర్చు చేసింది. మిగతా పదిహేను వేల కోట్లు పెట్టుబడిన వారి జాబితా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓను గట్టెక్కించిన ఈ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది . బీజేపీ, అదానీలకు సన్నిహితులైన కొందరు పారిశ్రామికవేత్తల కుటుంబాల నేతృత్వంలోని సంస్థలున్నట్లుగా చెబుతున్నారు.