రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనే లేదు. మంగళవారం బెంచ్ మీదకు రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కేసుల విచారణ కారణంగా రాలేదు. అయితే ఉదయం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో ఘనత వహించిన టీవీ 9 ఓ బ్రేకింగ్ వేసింది. విశాఖపట్నం రాజధానికి లైన్ క్లియర్. హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే అని .. ఆ బ్రేకింగ్ సారాంశం. దీంతో ఉందరూ ఉలిక్కిపడ్డారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగిందా అని ఆరా తీశారు. అలాంటిదేమీ లేదని తేలింది. ఏడో తేదీన విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్లో చూపించింది.
దీంతో టీవీ9 ఇలా ఒక్క సారిగా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుందని సోషల్ మీడియాలో విమర్సలు ప్రారంభమయ్యాయి. కాసేపటికి ఆ బ్రేకింగ్‌లు ఆపేశారు. కానీ నేరుగా సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే విచారణ జరిగినట్లుగా.. స్టే ఇచ్చేసినట్లుగా టీవీ9 ప్రచారం చేయడం మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. బ్రేకింగ్ నిలిపివేసింది కానీ..టీవీ9 తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేదు. ప్రేక్షకులకు తప్పుడు సమాచారం ఇచ్చామని క్షమాపణ చెప్పలేదు.
అమరావతికి టీవీ9 వ్యతిరేకం. ఆ విషయం అందరికీ తెలుసు. తెలంగాణకు చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న టీవీ9 అమరావతికి.. రైతులకు మద్దతుగా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ.. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ఎందుకన్న వాదన వినిపిస్తోంది. నేరుగా సుప్రీంకోర్టులోనే ఇన్వాల్వ్ చేసి తప్పుడు ప్రచారం చేయడం మాత్రం ఇప్పుడు టీవీ9ని అందరిలో మరోసారి చులకన చేసింది. టీవీ9లో ఏం కనిపించినా .. వినిపించినా నమ్మలేని పరిస్థితికి తీసుకెళ్లింది.