ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్నా, డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు , ట్యాపింగ్ వ్యవహారాలపై పవన్ తొలి సారి స్పందించారు. ఎమ్మెల్యేలే ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత లేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని నేరుగా సీఎం.. ఆయన కార్యాలయంపైనే ఆరోపణలు చేశారన్నారు. సొంత ఎమ్మెల్యేలపై నిఘాలు, సంభాషణలు దొంగ చాటుగా వినడం.. అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయని జగన్ పై మండిపడ్డారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా డీజీపీ, హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని పవన్ ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై డీజీపీ స్పందించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రారంభమైన అలజడి… ఆ పార్టీలో సునామీలా మారుతోంది. ఈ అంశంపై టీడీపీ నేతలు ఇంత వరకూ స్పందించలేదు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీపైనే ఆరోపమలు చేస్తున్నారు. వారు టీడీపీతో మాట్లాడుకున్నారని అంటున్నారు. కానీ టీడీపీ మాత్రం పరిణామాలను గమనిస్తోంది. అయితే ఈ ఇష్యూ పవన్ నేరుగా స్పందించారు. తక్షణం డీజీపీ బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. కోటంరెడ్డి తరహాలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాననడం కీలకంగా మారింది.