తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుందని ఇప్పటికే మీడియా వర్గాలకు లీకులు ఇచ్చింది. రూ. మూడు లక్షల కోట్ల కేటాయింపులు వివిధ పథకాలకు చేస్తే సరిపోదు.. ఆ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారో కూడా పద్దుల్లోనే చూపించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, నిధులు రాలేదు. చివరికి అప్పులపై కూడా పరిమితి విధించారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది.
కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో కొండత వస్తాయని ఊహించుకోవడం.. తర్వాత ఊసురుమనడం రివాజుగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 59వేల కోట్లు వస్తాయని వేసుకుంటే నికరంగా వచ్చేది 24వేలకోట్లే. వచ్చే ఏడాది కూడా మహా అయితే మరో రెండు, మూడు వేల కోట్లు పెరుగుతాయేమో కానీ భారీగా పెరగవు. మరో వైపు అప్పులపై పరిమితి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. బడ్జెట్లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు.
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం పెంపునకు రకరకాల మార్గాలను అన్వేషించినట్లుగా తెలుస్తోంది. ఇసుక వంటి వాటి రేట్ల పెంపుతో పాటు హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది. ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది.