ఇటీవల తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిన్న తన జమ్మలమడుగు నియోజకవర్గంలో తెదేపా జిల్లా కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన పార్టీలోకి తన రాకను వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి గురించి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఆయన పార్టీ కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “నేను జగన్మోహన్ రెడ్డికి జిల్లాలో చెక్ పెట్టేందుకే తెదేపాలో చేరాను. ఆనాడు ఆయనకున్న లక్ష కోట్ల అక్రమాస్తులు రూపాయి వడ్డీ వేసుకొన్నా ఇప్పుడవి ఆరు లక్షల కోట్లు అయ్యుంటాయి. వాటి గురించి ఎక్కడో కాదు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంలోనే మాట్లాడగలను,” అని అన్నారు.
ఇక పార్టీలో తన రాకను వ్యతిరేకించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ “నేను ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాను. నాకు నా నియోజకవర్గం అభివృద్దే ముఖ్యం తప్ప వేరేది కాదు. ఆయన నాకు సహకరిస్తే నేను సహకరిస్తాను. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను అదే పని చేయడానికి వెనుకాడను,” అని నిర్భయంగా చెప్పేరు. కనుక తనతో రామసుబ్బారెడ్డి వర్గం ఏవిధంగా వ్యవహరించాలనేది వారినే నిర్ణయించుకోమని స్పష్టం చేసారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు, ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఆదినారాయణ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరారు కనుక జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం సహజమే. కానీ తెదేపాలో చేరిన వారం రోజులకే పార్టీలో సీనియర్ నేత అయిన రామసుబ్బారెడ్డికి ఈవిధంగా వార్నింగ్ ఇవ్వడం, అది కూడా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడి సమక్షంలోనే ఇవ్వడం విశేషమే.