కొత్త తరహా కథలు ఆలోచించడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. ఆ, కల్కి, జాంబిరెడ్డి… ఇలాంటి సినిమాలే. హను – మాన్‌తో ఫాంటసీకి మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు మరోసారి తన కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చాడు. `హీరో` ఫేమ్ జయదేవ్ గల్లా రెండో సినిమా మొదలెట్టాడు. అర్జున్ జంథ్యాల దర్శకుడు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మనే కథ అందించాడు. ఇది మాస్ సినిమానే. కాకపోతే.. దానికి మైథలాజికల్ అంశాలూ ముడి వేశాడు. హీరో సినిమా అనుకొన్నంత ఫలితం తీసుకురాకపోవడంతో, రెండో సినిమాపై బాగా ఫోకస్ చేశాడు జయదేవ్ గల్లా. దాదాపు వంద కథలు విన్న తరవాత.. ప్రశాంత్ వర్మ చెప్పిన కథని ఓకే చేశారు. దర్శకుడు అర్జున్ జంథ్యాల ఇది వరకు `గుణ 369` తీశాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు కానీ, మేకింగ్ పరంగా బాగుంటుంది. చివర్లో ట్విస్టు కూడా ఆకట్టుకొంటుంది. పైగా అర్జున్ బోయపాటి శ్రీను శిష్యుడు. బోయపాటి లా హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయగలడు. అందుకే ఈ కథని.. అర్జున్ చేతిలో పెట్టారు. ఈరోజే హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హీరోయిన్, విలన్ పాత్రల కోసం అన్వేషణ జరుగుతోంది.