లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు క్యారెక్టర్ ను బయటకు తీశారు. నేరుగా న్యాయవ్యవస్థను టార్గెట్ చేశారు. ఏపీలో హైకోర్టు పరిధి దాటిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉందని.. అలాంటి శాసన అధికారం రాష్ట్రానికి లేదంటూ కోర్టు తీర్పు చెప్పిందని ఆయన ఆరోపించారు. ఇంకా పలు రకాల కామెంట్లు చేశారు.
విజయసాయిరెడ్డి కామెంట్లను రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్ ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయవ్యవస్థపై చేస్తున్న విమర్శలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. అయినా విజయసాయిరెడ్డి తన ధోరణిలో తాను ముందుకెళ్లిపోయారు. ఇలా మాట్లాడటం ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు సహజంగానే వస్తున్నాయి. గతంలో కూడా విజయసాయిరెడ్డి ఇలా న్యాయవ్యవస్థపై నిందలేశారు. త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సమయంలో ఇలాగే మాట్లాడారు.
నిజానికి రాజధాని విషయంలో హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నరైతుల హక్కును భక్షిస్తోందన్న కారణంగానే ఆ రిట్ ఆఫ్ మాండమస్ ను హైకోర్టు ఇచ్చింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. అయినా సరే అటు జగన్ కానీ.. ఇటు విజయసాయిరెడ్డి కానీ ఎవరూ న్యాయవ్యవస్థను గౌరవించకుండా.. రాజ్యాంగాన్ని లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ తీరు న్యాయవర్గాల్లోనూ విస్తృత చర్చకు కారణం అవుతోంది.