గత ఎన్నికల్లో రైతు బంధు కేసీఆర్ ను గట్టెక్కించింది. ఈసారి దళిత బంధుతో ప్రయత్నించాలని అనుకున్నారు. కానీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దీంతో కేసీఆర్ మళ్లీ రైతులనే ఆకట్టుకునేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా బీఆర్ెస్ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు పెన్షన్ స్కీమ్ ప్రవేశ పెట్టడానికి కసరత్తు దాదాపుగా పూర్తి చేశారని.. మేనిఫెస్టోలో పెట్టడమో..లేకపోతే మొదటగా అమలు చేసి.. ఎన్నికలకు వెళ్లడమో చేస్తారని బీఆర్ఎస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ భూమి పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న రైతుబందు పథకం లెక్కల ప్రకారం 68 లక్షల రైతుల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రస్తావన లేదు. నిధుల కేటాయింపు లేదు. దళిత బంధు పథకం కూడా బడ్జెట్లో పెట్టకుండానే ప్రారంభించారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుబంధు స్కీంను బడ్జెట్లో పెట్టలేదు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో ఉత్తరాదిలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ రైతుకు పెన్షన్ స్కీమ్ కూడా బాగా ఉపయోగపుడుతుందని అనుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని ఈ విశిష్ట పథకాన్ని తెలంగాణలో ప్రారంభిస్తే టాక్ ఆఫ్ ది టౌన్ వుతుందని నమ్ముతున్నారు. ఈ పథకాన్ని అమలు చేసి అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు- తెలుస్తోంది. అయితే ఈ పథకాన్ని తెలంగాణలో ముందు అమలు చేస్తారా.. మేనిఫెస్టోలో పెడతారా.. అన్నది మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.