తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు నలుగురు కలెక్టర్లపై కోపం వచ్చింది. వారిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని… దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని, వీరి వ్యవహారం త్వరలోనే బయటపెడతామని బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ప్రగతి భవన్లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల నిజాయితీతో కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్లకు చెడ్డపేరు వస్తోందన్నారు.
ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఇంతకీ ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు అన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్కు అత్యంత సన్నిహితమైన కలెక్టర్ గా పేరు పొందిన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు పవర్ లో ఉన్న నలుగురు కలెక్టర్లపై బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి స్పష్టమన సమాచారం ఉండే ఉంటుందని అందుకే ఇలాంటి హెచ్చరికలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ నలుగురు కలెక్టర్లు ఎవరన్నది అధికార వర్గాలకు స్పష్టత ఉంది. ఆ నలుగురికి ప్రభుత్వ పెద్దల వద్దకు నేరుగా యాక్సెస్ ఉంటుందని చెబుతున్నారు. వీరే కీలక నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెబుతున్నారు. నిజంగానే బండి సంజయ్ వద్ద ఆధారాలు ఉండి.. డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే.. ఈ ఆధారాలను సహజంగానే బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. అయితే .. కేసీఆర్ వద్ద కోటరిగా ఉన్న అధికారులను కంట్రోల్ చేయడానికే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.