పార్లమెంట్లో రాహుల్ గాంధీ మంగళవారం స్పీచ్ వైరల్ అయింది. ఆయన నేషనల్ హాట్ టాపిక్‌గా మారిన అదానీ గురించి చాలా ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రదాని మోదీ ఇచ్చే సమాధానంలో అన్నింటికీ సమాధానాలు చెబుతారని అనుకున్నారు. మోదీ వచ్చారు.. స్పీచ్ ఇచ్చారు.. కానీ అదానీ గురించి ప్రజల్లో ఉన్న సందేహాలకు కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
ఎప్పట్లాగే ప్రధాని మోదీ విపక్షాలు.. దేశం అభివృద్ధి చెందుతూంటే.. అసూయ పడుతున్నట్లుగా ప్రకటించారు. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ లో అద్భుతమైన స్వేచ్చ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న చాలా విజయాల గురించి చెప్పారు. ఈ క్రమంలో విపక్షాలపై సెటైర్లు వేశారు. విమర్శలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అదానీ గురించి తమపై వస్తున్న విమర్శలకు ఎందుకు సమాధానం చెప్పలేదన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది.
అదానీ ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్. ఆ సంస్థ వద్ద ప్రజాధనం లక్ష కోట్లకుపైగానే ఉంది. కొన్ని లక్షల మంది మదుపరులు .. రూ. పది లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ లో నష్టపోయారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అక్రమాలకు పాల్పడటం వల్లనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంత జరిగినా.. అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ.. సెబీ కానీ.. సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న దాఖలాలు లేవు.
ప్రధాని మోదీ ఎప్పట్లాగే.. తన మాటలతో ప్రసంగాన్ని పూర్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి .. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు .. తమ పాలనను పొగడుకోవడం.. కాంగ్రెస్ పాలనను విమర్శించడంలోనే వెదుక్కోమని చెప్పేశారు.