కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. అసలు ఆయన ఇక కాంగ్రెస్ పార్టీకి లేరని అనుకున్నారు. కొత్త ఇంచార్జ్ వచ్చాక తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పుకున్నారు. గాంధీ భవన్ కు వెళ్లి రేవంత్ రెడ్డి ని కలిసి మాటలు కలిపారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు వెలిశాయి. కోమటిరెడ్డి కోవర్ట్ అని ఆ పోస్టర్ల సారాంశం.
కోమటిరెడ్డి సహంజాగనే ఈ పోస్టర్ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని అనుమానించి మళ్లీ సైలెంట్ అయ్యారు. అందరూ పాదయాత్రలు చేయాలని చెప్పినా కోమటిరెడ్డి ప్రారంభించలేదు. ఎవరెవరు యాత్రలు చేయడం లేదనే సంగతి హైకమాండ్ కు రిపోర్టు వెళ్లినట్లుగా తెలియడంతో బయటకు వచ్చారు. గురువారం నాడు కాంగ్రెస్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సమయం తక్కువగా ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెబుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. యాత్రలో ఎవరినీ విమర్శించబోనన్నారు. అందరు నేతలు ఇళ్లు, పార్టీ కార్యాలయాలను వదిలి ప్రజల్లోనే ఉండాలని కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ చెబుతోంది. కానీ తనకు పీసీసీ చీఫ్ ఇవ్వనందుకు కోమటిరెడ్డి ఫీలవుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అన్నదానిపై ఇప్పటికీ సందేహాలున్నాయి. అయితే ఇలాంటి చర్చ మళ్లీ జరగకుండా ఏదో ఓ యాత్ర చేయాలని అనుకుంటున్నారు.