ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గా ఉంది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి.
మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైసీపీకే అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి విపక్షాలు పోటీ పెట్టే అవకాశం లేదు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మాత్రం ఓటింగ్ జరగనుంది. పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే తమ అభ్యర్థులను వైసీపీ, టీడీపీ ఖరారు చేశాయి. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. . పశ్చిమ రాయలసీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ స్థానానికి కంచర్ల శ్రీకాంత్ అభ్యర్థిత్వాలను టీడీపీ తరపున ఖరారు చేశారు. వారు ప్రచారం చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం నియోజకవర్గానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ పేరును ప్రకటించింది.అనంతపురం-కడప-కర్నూలు నియోజకవర్గానికి వెన్నపూస రవీంద్ర రెడ్డి పేరును ప్రతిపాదించింది. ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గోపాలరెడ్డి కుమారుడే ఆయన. ఇక చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసింది. పట్టభద్రులు ఓట్లు వేయనున్నందున చదువుకున్న వారి నాడి తెలుస్తుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.